చమురు!!!

“చమురు” సాధారణ భాషలో ఇంధనం,నూనె అంటారు- కానీ ఇదే పదాన్ని వివిధ సందర్భాలలో వాడటం రివాజు-సందర్భాన్ని బట్టి అర్ధం మారుతుంది!

చేతి చమురు: చేతిలో డబ్బులు ఖర్చవడం-వృధాగా అని భావం.

మామూలు ఖర్చుకు కూడా ఈమాట వాడే లోభులుంటారు ఈ లోకంలో-అది వేరే సంగతనుకోండి!

ఒంటి చమురు వదిలించుకోవడం: ఒంటికి అంటిన మలినం,మలికి, మురికి వదిలించుకునే ప్రయత్నం చేయడం ప్రతీ దీపావళికి ఒంటికి దట్టంగా శ్రేష్టమైన నువ్వులనూనెని పట్టించుకుని ఓ అరగంట పైగా ఎండలో నిలబడి,పిదప నీటితో కలిపిన సున్నిపిండితో ఒళ్లంతా పట్టించి కాసేపు ఆరనివ్వడం.

తదనంతరం ఒంటిపైఉన్న ఆ సున్నిపిండిని బాగా మెలిపి నలిపే పనిచెయ్యడం, దాని పర్యవసానంగా ఒంటికి ఉన్న మురికిని సున్నిపిండి ఆప్యాయంగా తనలో తీసుకుని మనం నలిపినప్పుడు కిందపడుతుంది!

దీపావళికి మాత్రం ఈ కార్యక్రమం తప్పనిసరి! ఈ కార్యక్రమం మధ్యలో వచ్చే కొన్ని పండుగలప్పుడు కూడా చెయ్యడం రివాజు-దీపావళికే కాకుండా!

అసలు ఈ కార్యక్రమం అయిన తర్వాత స్నానం చేసి ఓ నిద్ర వేస్తే-ఇంట్లోవాళ్ళు లేపేదాకా మెలకువే రాదు- ఆ నిద్ర హాయ్ వేరు- అమర్థం.

ఇప్పుడు షాంపూ స్నానాలు,సబ్బుతో ఒళ్ళు కడగటమూనూ ఓ బకెట్టుతో-మరి ఒంటిమురికి ఎలా వదులుతుంది.మన మనస్సులో మురికి లాగా ఒంటిమీద కూడా అలాగే కొంత ఉండిపోతుంది.దానికి తోడు మంచిబట్టలు కట్టుకుంటాం,మంచిగా మాట్లాడతామాయె-ఒంటిమీద మురికి-ఒంటిలోన మురికి పరులకు కనపడదుగా!

తల చమురు: తలకి రాసుకునే నూనెలు-ఇప్పుడు ఈ అలవాటు దాదాపుగా మృగ్యమై పోయింది; నూనె రాసే తలకాయలే కనపడవు!

దీపాలు వెలగాలన్నా మన పొట్టలోకి ఏదైనా వెళ్లాలన్నా చమురు లేందే ఒక్క క్షణం గడవదు.చమురు లేకుండా మన వాహనాలు ఎలా కదలటానికి మొరాయిస్తాయో చూస్తూనే ఉన్నాం కదా!

చమురు మన నిత్యజీవితంలో చాలా ముఖ్యమైనపాత్ర పోషిస్తుంది చమురులేకుండాఒక్కరోజు కూడా గడవదు అంటే అతిశయోక్తి కాదు; చమురుకి ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే "ఇంటికి దీపం ఇల్లాలు" అన్నారు కదండీ పెద్దలు-అలాగే చమురు లేకుండా దీపం వెలగదు కదా మరి-కానీ ఆ దీపానికి చమురు మాత్రం మాగాడేనండి-కాదంటారా!

ఇదేదో పురుషాహంకారంతో అనట్లేదు,జీవిత సత్యం- ఏ కాలమైనా.పెళ్ళీ పెటాకులు లేకుండా సహజీవనం చేసేవాళ్ళని నేను పరిగణలోకి తీసుకోలేదు మరి- అయినా వాళ్ళకీ సామెత వర్తించదుగా- వాళ్ళు ఇల్లాళ్లు కాదుగా! అందుకని వాళ్ళు కూడా నా మాటల్ని పట్టించుకోరు!

ఏదో చమురు గుర్తుకొచ్చి ఇవన్నీ గబగబా రాసేశా!

ఇక చమురు చూసినప్పుడు,గుర్తుకొచ్చినప్పుడు-ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అనవసరంగా చేతి చమురు మాత్రం వదిలించుకోకండి!

divider

Share your thoughts with Author!!

Spread the words out!!!